: కేసీఆర్ మొండిఘటం.. ఎవరికీ భయడపడని వ్యక్తి!: అమిత్ షాకు హరీశ్ రావు కౌంటర్


కేసీఆర్ ఎవరికో భయపడి విమోచన దినం జరపడం లేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో హరీష్ మీడియాతో మాట్లాడుతూ,‘కేసీఆర్ మొండిఘటం.. ఎవరికీ భయడపడని వ్యక్తి. అందుకనే, పద్నాలుగేళ్లు పోరాడి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ ఎవరికీ భయపడని నాయకుడు అని అమిత్ షా గుర్తించాలి’ అని హరీష్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచి, ముఖ్యమంత్రులను దించి సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న ఘనత బీజేపీది, అమిత్ షాది అని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల గురించి బీజేపీ మాట్లాడటం దారుణమని, కేంద్ర మంత్రులుగా ఉన్న పురంధేశ్వరి, కావూరి సాంబశివరావుకు ఎన్ని కోట్లు ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, హైకోర్టు విభజన గురించి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు. ఆరు మండలాలతో పాటు లోయర్ సీలేరు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు లను తెలంగాణా కోల్పోయిందని, గిరిజనులను నిరాశ్రయులను చేసి పోలవరం ప్రాజెక్టు కడుతున్నారంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ వాటా కింద ఇచ్చింది రూ.47 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను రెట్టింపుగా ఉంటుందని అన్నారు. అవసరమైతే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అడిగితే తెలంగాణ ప్రజలు ఎంత పన్నులు కట్టారో తెలుస్తుందన్నారు.

  • Loading...

More Telugu News