: స్కూళ్లు ఎప్పుడూ ఉంటాయి... మృత్యువు ఆగుతుందా?: కేజ్రీవాల్ సర్కార్ పై క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలంతా జ్వరాలతో అల్లాడుతున్న వేళ, అండగా ఉండాల్సిన నేతలు, విదేశీ పర్యటనలకు వెళ్లడంపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ప్రజలు చనిపోతుంటే, పాలకులు స్టడీ టూర్ పేరిట విదేశాల్లో ఉండటం, పరిస్థితి తీవ్రత తెలిసినా కూడా వెంటనే ఇండియాకు రాకపోవడం దురదృష్టకరమని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతూ, పాఠశాలలు ఎంతకాలమైనా వేచి వుంటాయి, మృత్యువు వేచి చూడదని కాస్తంత కటువు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఆరోపణలు చేస్తూ, బాల్ ను ఒకరి కోర్టు నుంచి మరొకరి కోర్టుల్లోకి నెట్టుకోకుండా, పరిపాలనలో నిమగ్నమై, ప్రజల ఇబ్బందులను తొలగించాలని సలహా ఇచ్చాడు. చికున్ గున్యా పీడిస్తున్న వేళ, చాలినంత మంది ఆప్ నేతలు విధుల్లో లేకపోవడం బాధాకరమని అన్నాడు. గౌతమ్ గంభీర్ నేడు 11:20 నుంచి 11:43 మధ్య పెట్టిన ఈ ట్వీట్లు వేల సంఖ్యలో రీట్వీట్లను తెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో దూసుకెళుతున్నాయి.