: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా భావించి సిరియా సైన్యంపై విరుచుకుపడ్డ అమెరికా!
సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసే పనుల్లో ఉన్న అమెరికా సైన్యం పొరపాటున సిరియా సైన్యాన్ని చుట్టుముట్టి బాంబులు కురిపించి 62 మంది మరణానికి కారణంకాగా, జరిగిన తప్పుకు చింతిస్తున్నామని యూఎస్ అంబాసిడర్ సమంతా పోవర్ ఓ ప్రకటన వెలువరించారు. ఐఎస్ఐఎస్ నియంత్రణలో ఉన్న డేయిర్ ఇజ్జార్ పట్టణం సమీపంలో సిరియా ఆర్మీ పోస్ట్ ఉండగా, దీనిపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రష్యా అత్యవసర భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేయగా, దాన్ని అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పిన సమంతా పోవర్, ఇది కావాలని జరిగింది కాదని, సైనికుల ప్రాణాలు పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఈ తప్పును రష్యా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదుల స్థావరమని భావించిన మీదటే తమ సైన్యం దాడికి దిగిందని తెలిపారు.