: చెలరేగిన ఉగ్రవాదులు... ప్రాణాలర్పించిన 17 మంది జవాన్లు


ఈ తెల్లవారుఝామున జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ ఆర్మీ ఆఫీసుపై ఉగ్రదాడికి దిగిన ఘటనలో మొత్తం 17 మంది జవాన్లు వీరమరణం పొందారని అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్లు పేలి భారీ ఎత్తున పొగ, మంటలు వ్యాపించగా, వారికి ఎదురొడ్డిన భారత సైన్యం తీవ్రంగా పోరాడిందని, ఈ ఘటనలో మరో 20 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు. ఆర్మీ బేస్ క్యాంపులో మంటలంటుకుని మూడు బ్యారక్ లు పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు. దేశమాత సేవకోసం వీరంతా ప్రాణాలు అర్పించారని కొనియాడారు. పాక్ సరిహద్దుల్లో ఉన్న కీలకమైన సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకోవడాన్ని పరిశీలిస్తుంటే, వీరు ముందస్తు ప్రణాళికతోనే వచ్చారని స్పష్టమవుతోంది. సరిహద్దులు దాటి యూరీ సెక్టార్ లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడగా, వీరిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు హెలికాప్టర్లలో పారా మిలిటరీ బలగాలను పంపిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు గంటల పాటు ఎన్ కౌంటర్ కొనసాగగా, నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరింత మంది ఉగ్రమూక ఉండవచ్చన్న అనుమానంతో ఈ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News