: బెంగళూరులో 42 బస్సులకు నిప్పు పెట్టేలా చేసింది 22 ఏళ్ల యువతి... అరెస్ట్ చేసిన పోలీసులు
కావేరీ నదీ జలాలను తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వేళ, బెంగళూరు సమీపంలోని ఓ బస్సు డిపోలో కేపీఎన్ ట్రావెల్స్ కు చెందిన 42 వోల్వో బస్సులకు నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించగా, ఆందోళనకారులను బస్సుల దగ్ధం దిశగా ఉసిగొల్పింది ఓ యువతని పోలీసులు నిర్థారించారు. రోజువారీ కూలీ చేసే సి.భాగ్య (22) కేపీఎన్ బస్సుల గ్యారేజీకి దగ్గర్లోనే నివాసం ఉంటోందని, ఆ రూట్లో వెళుతున్న ఆందోళనకారులకు బస్సులు అక్కడున్నాయని, అన్నీ తమిళనాడు బస్సులని, నిప్పు పెట్టాలని ప్రేరేపించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. తొలుత ఐదుగురు ఆందోళనకారులను విచారించి, ఆపై భాగ్య ప్రమేయాన్ని సీసీ కెమెరాల ఆధారాలతో ఖరారు చేశారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. తన తరఫున వాదించేందుకు న్యాయవాదిని పెట్టుకోలేనని ఆమె న్యాయమూర్తికి చెప్పడం గమనార్హం. మరోవైపు బస్సుల వద్దకు వచ్చిన ఆందోళనకారుల ముందు భాగ్య ఉన్నట్టు కేపీఎన్ డ్రైవర్లు కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. తమ బస్సుల దగ్ధంపై నిందితులను కఠినంగా శిక్షించాలని కేపీఎన్ ట్రావెల్స్ యజమాని కేపీ నటరాజన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కోరారు.