: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూకంపం
కొద్దిసేపటి క్రితం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, దుత్తలూరు మండలాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పామూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల గోడలకు బీటలు వారాయి. స్వల్ప ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం ఏమీ జరగలేదని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లాలో పలుమార్లు భూ ప్రకంపనలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనలు ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.