: వెయిటింగ్ లిస్టా?... సులువుగా రైలు టికెట్ కన్ ఫర్మ్ చేసుకునే మార్గాలివి!


రైల్వే టికెట్ల విషయంలో వెయిటింగ్ లిస్టు జాబితా ప్రయాణికులను ఎన్ని ఇబ్బందులు పెడుతుందో అందరికీ తెలుసు. వెయిటింగ్ లిస్టులో ఐదవ నెంబరులో ఉన్నా ఒక్కోసారి కన్ఫర్మ్ కాదు. మరోసారి 100 దాటినా కన్ఫర్మ్ అవుతుంటుంది. ఏ రూట్లో టికెట్ ఏఏ ట్రయిన్లకు సులువుగా లభిస్తుందన్న విషయం ఓ పట్టాన అర్థం కాదు. దాన్ని తెలియజేసేందుకు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో తయారైన యాప్ లు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను తీసుకోండి. సికింద్రాబాద్ నుంచి ఒంగోలు వరకూ ప్రయాణించాలని భావించే వారికి వెయిటింగ్ లిస్టు 20 కనిపించిందనుకోండి. అదే సికింద్రాబాద్ ముందున్న మౌలాలీ స్టేషన్ నుంచి రిజర్వ్ చేయించుకోవాలని చూస్తే, వెంటనే ఖాళీలు కనిపిస్తాయి. ఇలా ఇంకాస్త ముందు లేదా వెనుక నుండే రైల్వే స్టేషన్ల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయా? కొద్ది దూరం వెళ్లిన తరవాత ఏ స్టేషన్లో బెర్తులు లభిస్తాయి? సులువుగా గమ్యస్థానాన్ని చేరుకునే మార్గాలేంటి? రిజర్వేషన్ తో ఒక రైల్లో కొంత దూరం వరకూ ఆపై, మరో రైల్లో ప్రయాణించే వీలు... ఇలా వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చిన యాప్ లలో 'కన్ఫర్మ్ టికెట్' ఒకటి. ఇది అటు యాప్ ద్వారా, ఇటు వెబ్ సైట్ ద్వారా సమాచారాన్ని అందిస్తుంది. పీఎన్ఆర్ నెంబరును ఫీడ్ చేస్తే, టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అన్న సమాచారం వస్తుంది. ఎక్కే, దిగే స్టేషన్ల వివరాలు ఫీడ్ చేస్తే, ఆ దారిలో వెళ్లే రైళ్లు, ఖాళీలు, ఎక్కాల్సిన స్టేజీ తరువాతి స్టేషన్లలో ఖాళీలు ఇత్యాది వివరాలు అందిస్తుంది. ప్రతి స్టేషన్ కూ కొన్ని రిజర్వ్ సీట్లుంటాయి. చిన్న స్టేషన్లలో అవి ఖాళీగా ఉంటాయి. ఇలాంటి సమాచారాన్ని అందిస్తుంది. మరో ఉదాహరణగా, సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్లాలని అనుకుంటే, కనిపించే వెయిటింగ్ లిస్టు, రేణిగుంట వరకూ గమ్యాన్ని ఎంచుకుంటే, ఖాళీలు కనిపించవచ్చు. ఈ యాప్ ను ఇప్పటికే పది లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇక ఇటువంటిదే 'రైల్ యాత్రి'. రైలు ఎక్కడి వరకూ వచ్చింది? ఎంత ఆలస్యంగా నడుస్తోంది? ఏ స్టేషన్లో ఏ ప్లాట్ ఫాం మీదకు వస్తుంది? ఎన్ని బెర్తులు, సీట్లు ఖాళీలు ఉన్నాయి? రైలు మార్గమధ్యంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ లభించవు? వంటి వివరాలను అందిస్తుంది. దీని ద్వారా సీట్లు బుక్ చేసుకుంటే, రుచికరమైన ఆహారాన్ని సీట్ల వద్దకు అందిస్తుంది కూడా. దీంతో పాటు 30 నగరాల్లో రైలు దిగిన తరవాత టాక్సీ సేవలనూ అందిస్తోంది. ఇక 'ట్రెయిన్ మ్యాన్', 'టికెట్ జుగాడ్' వంటి యాప్ లకు సైతం ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీటి ద్వారా లభిస్తున్న సమాచారం 90 శాతానికి పైగా సరైనదేనని వీటిని వాడుతున్న వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇవి ఉచితంగానే లభిస్తున్నాయి. మీరూ ఓసారి వీటిని వాడి చూడండి!

  • Loading...

More Telugu News