: రన్ వేను దాటి బురదలో కూరుకుపోయిన స్పైస్ జెట్ విమానం... రేణిగుంటలో రాత్రి నుంచి ఆగిన విమానాలు


భారీ వర్షాలు, వేగ నియంత్రణలో వైఫల్యం, రన్ వేపై కొన్ని లైట్లలో ఏర్పడిన సాంకేతిక లోపం, కారణాలేమైతేనేం, హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్న స్పైస్ జెట్ విమాన ప్రయాణికులకు కాసేపు తీవ్ర భయాందోళన కలిగింది. నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో ల్యాండయిన స్పైస్ జెట్ విమానం, రన్ వేను దాటి బయటకు వెళ్లి, అరకిలోమీటర్ దూరం ప్రయాణించి బురదలో కూరుకుపోయింది. విమానంలో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉండగా, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. రన్ వే దాటి విమానం ముందుకెళ్లడంతో తాము భయపడినట్టు ప్రయాణికులు వ్యాఖ్యానించారు. మరో పావు కిలోమీటర్ దూరంలో ప్రహరీ గోడ ఉండటంతో, విమానం మరికాసేపు ప్రయాణించివుంటే, పెను ప్రమాదమే జరిగుండేదని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రాత్రి నుంచి విమానాశ్రయం నుంచి సర్వీసులు నిలిచిపోగా, నేడు ఉదయం డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు ఎయిర్ పోర్టును, రన్ వేను సందర్శించారు. బురదలో కూరుకుపోయిన విమానాన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పలు విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News