: నయీమ్ దందాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు... నేడో రేపో సిట్ నోటీసులు!
గతంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సహకరించి, భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు సాగించారన్న ఆరోపణలపై ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలకు ప్రత్యేక విచారణ బృందం నేడో రేపో నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నయీమ్ దందాల వెనుక వీరి పాత్రపై ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించిన వారిలో అత్యధికులు గతంలో వేరే పార్టీల్లో ఉండి, ఆపై టీఆర్ఎస్ లో చేరినట్టు సమాచారం. ఇద్దరు ముగ్గురు ఇంకా కాంగ్రెస్, తెలుగుదేశంలోనే ఉండగా, మిగతావారంతా అధికార పార్టీలో ఉండటంతో, నోటీసులు ఇచ్చే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారి జాబితాను సిట్ అధికారులు పంపినట్టు తెలుస్తోంది. కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వీరికి నోటీసులు పంపాలని అధికారులు భావిస్తున్నారు. నల్గొండ, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు నయీమ్ అండగా, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కాజేశారని తెలుస్తుండగా, అందరి పేర్లూ బయటకు వస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొంది. నయీమ్ వెనుక మాజీ మంత్రి, టీడీపీ నేత ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్.కృష్ణయ్యల పేర్లు బయటకు రాగా, వీరంతా ఇప్పటికే తమపై వచ్చిన ఆరోపణలను ఖండించిన సంగతి తెలిసిందే.