: నయీమ్ కేసులో తన పేరు బయటకు రాకుండా చూసుకునేందుకు బాధితులకు కోట్లు ఆఫర్ చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ!

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం ఆయనతో సంబంధాలున్న రాజకీయ నేతలు, పోలీసు అధికారులపై సిట్ బృందాలు ఉచ్చు బిగిస్తున్న వేళ, టీఆర్ఎస్ లో ఉన్న ఓ ఎమ్మెల్సీ తన పేరును బయట పెట్టకుండా చూసేందుకు బాధితులకు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే నయీమ్ తో సంబంధాలున్న పార్టీ లీడర్లపై చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ కూడా అంగీకరించగా, ఈ వారంలో పలువురికి సిట్ అధికారులు నోటీసులు పంపి విచారించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, తన ప్రమేయంతో నయీమ్ దందాకు బలైన బాధితులతో రాజీ కుదుర్చుకునే దిశగా మధ్యవర్తులను వారి వద్దకు పంపి, నయీమ్ కు చెల్లించిన డబ్బును తాను వెనక్కిస్తానని చెప్పిస్తున్నారని సమాచారం. గతంలో నయీమ్ బాధితులను బెదిరిస్తున్న వేళ, భువనగిరి వ్యాపారి ఫోన్లో రికార్డయిన సంభాషణలో ఈ ఎమ్మెల్సీ పేరు కూడా ఉండగా, విచారణలో తన పేరు చెప్పకుండా చూడాలని, నష్టపోయిన డబ్బంతా ఇస్తానని చెబుతున్నట్టు తెలుస్తోంది. బాధితులతో మాట్లాడే బాధ్యతలను ఓ కాంగ్రెస్ నేత చేతుల్లో పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తనను గట్టున పడేయాలని, అందుకు ఎంతైనా ఖర్చు చేస్తానని చెబుతున్నారట. నయీమ్ కు, ఈ ఎమ్మెల్సీకి మధ్య వారధిగా ఉన్న టీఆర్ఎస్ నేత ఒకరు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండటంతో, తాను బయటపడే దారి కోసం వెతుకుతున్నారట!

More Telugu News