: అసదుద్దీన్ జాతి వ్యతిరేకి అన్న స్వామి.. ఆయన సర్టిఫికెట్ ఇస్తే దాచుకుంటానన్న ఒవైసీ
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతి వ్యతిరేకి అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన ఒవైసీ మాట్లాడుతూ స్వామి సర్టిఫికెట్ ఇస్తే జాగ్రత్తగా భద్రపరుచుకుంటానని పేర్కొన్నారు. ‘ఇండియా టుడే మైండ్ రాక్స్ 2016’ చర్చాగోష్టిలో పాల్గొన్న ఇరువురు నేతలు పై విధంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు విమర్శలు గుప్పించుకున్నారు. చర్చాగోష్టిలో కాసేపు నవ్వులు పూయించిన వీరు తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. అసద్ ద్రోహి అని తాను అనలేను కానీ, ఆయన జాతి వ్యతిరేకి అని మాత్రం చెప్పగలనని స్వామి అన్నారు. దీనికి అంతే దీటుగా స్పందించిన అసద్ మాట్లాడుతూ తాను జాతి వ్యతిరేకినని స్వామి సర్టిఫికెట్ ఇస్తే దానిని జాగ్రత్తగా దాచుకుంటానని చెప్పారు. హిందూత్వ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వారందరినీ స్వామి జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బలూచిస్థాన్ అంశాన్ని ప్రస్తావించిన ఒవైసీ బలూచిస్థాన్‌లో హింసను ప్రస్తావించినంత మాత్రాన కశ్మీర్ గాయాలు మానవని పేర్కొన్నారు.