: సెన్సార్ బోర్డుపై విమర్శలు వారి వ్యాపార సూత్రం: పహ్లాజ్ నిహ్లానీ
బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ పై సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహ్లానీ తీవ్ర విమర్శలు చేశారు. సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడమే విక్రమ్ భట్ క్యాంప్ వారి వ్యాపార సూత్రమని అన్నారు. వారి సినిమాలు విడుదలకు ముందు సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం పబ్లిసిటీలో భాగమని ఆయన పేర్కొన్నారు. విక్రమ్ భట్ సినిమాల్లో ఎన్ని ముద్దు సన్నివేశాలున్నా, లేకున్నా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. విక్రమ్ భట్ క్యాంపుకు సెన్సార్ బోర్డు వ్యాపార సాధనంగా మారిందని ఆయన మండిపడ్డారు. అందుకే తమ క్యాంపుకు సంబంధించిన సినిమాల విడుదల సమయంలో సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం ద్వారా వ్యాపారం, సినిమాపై ఆసక్తి పెంచుతారని ఆయన ఎద్దేవా చేశారు. తొలుత విమర్శలు చేస్తారని, ఈ తరువాత సెన్సార్ బోర్డు సభ్యులను రెచ్చగొడతారని ఆయన తెలిపారు. అలాంటి వారికి ఉచిత పబ్లిసిటీ ఎందుకివ్వాలని తాము స్పందించమని ఆయన అన్నారు. కాగా, విక్రమ్ భట్ తాజా 'హారర్' సినిమాలో 'ఎఫ్' అనే పదం వాడడాన్ని 32 సార్ల నుంచి 16 సార్లుకి తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించిందని, అలాగే తమ సినిమా థియేటర్ ట్రైలర్ కు 'యూ/ఏ' సర్టిఫికేట్, టీవీలో ప్రదర్శించే ట్రైలర్ కు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారని ఇదేం విధానమంటూ విక్రమ్ భట్ మండిపడిన సంగతి తెలిసిందే.