: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టిన కోదండరాం
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తప్పుబట్టారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయసేకరణ ప్రక్రియ ప్రహసనంగా మారకూడదని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేసి, వాటి ఏర్పాటుపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. సమగ్ర నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వం 1974 జిల్లాల ఏర్పాటు చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అది తాత్కాలిక అవసరాల కోసం ఏర్పడిందని అన్నారు. 1984లో వచ్చిన మార్గదర్శకాలు కొంత వివరంగా ఉన్నాయని కోదండరాం చెప్పారు. కొత్త చట్టం తెచ్చేవరకు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల ఏర్పాటుపై చట్టాన్ని సవరించాల్సి ఉందని చెప్పారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాల ఏర్పాటుకు ముందుగా తెలంగాణ ప్రభుత్వం ప్రాతిపదికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతోన్న వివరాలు సమగ్రంగా లేవని అన్నారు.