: అశ్విన్ ఆ రికార్డు సొంతం చేసుకుంటాడా?
టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ముంగిట బంగారంలాంటి అవకాశం ఉంది. ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే టెస్టు ముంగిట తను నిలిచి ఉన్నాడు. టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు తీసిన డెన్నిస్ లిల్లీ, వకార్ యూనిస్ ల సరసన నిలవాలంటే న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో అశ్విన్ ఏడు వికెట్లు తీయాలి. అలా తీస్తే...కేవలం 37 టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఉపఖండంలోని పిచ్ లపై స్పిన్ బౌలింగ్ తో రాణించడం సులువే. అయితే అందుకు తగ్గ బంతులేయడమే ముఖ్యం. న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత్ ను బాగా స్టడీ చేసి రావడంతో పాటు, ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా వారికి ఉంది. దీనికి తోడు స్పిన్ ను ఎదుర్కోవడమే తమ ముందున్న సవాల్ అంటూ పేర్కొనడం కూడా ఆ జట్టు ప్రాక్టీస్ విధానాన్ని బయటపెడుతోంది. ఈ నేపథ్యంలో అశ్విన్ ముందు కఠిన పరీక్ష ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఊహించని బంతులేయడంలో దిట్ట అయిన అశ్విన్, న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టులో ఏడు వికెట్లు తీయడం ద్వారా కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచి, 38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించిన డెన్నిస్ లిల్లీ, వకార్ యూనిస్ ల రికార్డును బద్దలు కొడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.