: ముందు మీకు వ్యాధులు రాకుండా చూసుకోండి!: టీచర్లకు చంద్రబాబు సూచన
టీడీపీ హయాంలోనే ఉపాధ్యాయ నియామకాలు ఎక్కువ జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు గుంటూరులో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి 200వ వర్థంతి సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. టీడీపీ ఉపాధ్యాయులను అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చిందని, ఇటీవలే 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. అన్ని అంశాలపైనా విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో టీచర్లు వాటిపై అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. ముందు ఉపాధ్యాయులు తమకు వ్యాధులు రాకుండా చూసుకోవాలని, తరువాత పిల్లలు, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నవ్వుతూ చెప్పారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. టీచర్లందరూ సమాజహితం కోసం ఇష్టపడి పనిచేయాలని చెప్పారు. ఇష్టపడి పనిచేస్తే ఎంతసేపు పనిచేసినా అలసట రాదని ఆయన చెప్పారు. తాను రాష్ట్రం కోసం రాత్రీపగలూ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇష్టపడి పనిచేస్తున్నాను కాబట్టే తాను అలసిపోవడం లేదని చెప్పారు. విద్యలో నాణ్యత పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.