: నాడు పార్లమెంటులో వెంకయ్య ఎందుకు ఆవేశపడ్డారు?: వైసీపీ నేత పార్థసారధి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో సన్మానం చేసిన అంశంపై వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదాను చంపిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారా? అందుకే సన్మానాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆనాడు పార్లమెంటులో వెంకయ్య ప్రత్యేక హోదా కోసం ఎందుకు అంతగా ఆవేశపడ్డారు? ఇప్పుడెందుకు తగ్గిపోయారు? అని ఆయన దుయ్యబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని, నిరుద్యోగ యువత హోదా కోరుకుంటున్నారని పార్థసారధి అన్నారు. వెంకయ్యకు చేసిన సన్మాన కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు టీడీపీ కూడా పాల్గొందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల అకాంక్షలను నాశనం చేశారని, అందుకే వెంకయ్యకు సన్మానం చేశారని ఆయన అన్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆశించామని, ఆశలన్నీ నిరాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.