: తక్షణమే ఏటీఎం పిన్ మార్చుకోవాలని ఖాతాదారులకు పలు బ్యాంకు అధికారుల సూచనలు
ఢిల్లీ, చండీగఢ్, కేరళ రాష్ట్రాల్లో ఇటీవలే వెలుగు చూసిన ఏటీఎం కార్డు లావాదేవీల మోసాల దృష్ట్యా ఖాతాదారులకు పలు బ్యాంకులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఖాతాదారులు ఏటీఎం కార్డు పిన్ నంబరుతో పాటు ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని బ్యాంకులు మెసేజ్ లు పంపుతున్నాయి. ఏటీఎం కార్డుదారుల బ్యాంకు అకౌంట్ల నుంచి ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో బ్యాంకులు ఈ సూచనలు చేస్తున్నాయి. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ, డీబీఎస్, ఫెడరల్ బ్యాంక్ తమ ఖాతాదారుల సెల్ఫోన్లకు సందేశాలు పంపుతున్నాయి. జరుగుతోన్న మోసాలపై కూడా అవగాహన కల్పిస్తున్నాయి. ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డు లేని, ప్రజలు అధికంగా కనిపించని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను ఆపేయాలని కూడా బ్యాంకులు కోరుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో రోమేనియన్ వ్యక్తి ఓ ఏటీఎం సెంటర్లో ఖాతాదారుల ఏటీఎం కార్డుల వివరాలు సేకరించే స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే.