: వెంకయ్యనాయుడికి ‘అవాస్తవాల వెంకయ్య’ అని బిరుదు ఇవ్వాలి: చలసాని శ్రీనివాస్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో చేస్తోన్న అభినందన సభపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ తెచ్చినందుకు సన్మానాలు చేసుకోవడం ప్రత్యేక హోదాకు తూట్లు పొడవడమేనని అన్నారు. ఇటువంటి పనిచేయడం వెంకయ్యకే చెల్లిందని ఆయన అన్నారు. వేలాది మంది కార్యకర్తల మధ్య సన్మానం జరుపుకోవడం శోచనీయమని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడికి 'అవాస్తవాల వెంకయ్య' అని బిరుదు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ లాభం చేస్తోందని వెంకయ్యనాయుడు చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలుపుతున్న వారిని నిర్బంధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తోన్న ఈ చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.