: ప్రధాని పుట్టిన రోజుకు 3750 కిలోల కేకు
ప్రతి ఒక్కరికీ తమ పుట్టిన రోజు ప్రత్యేకమే. మరి దేశ ప్రధాని పుట్టిన రోజు అంటే చాలా మందికి పండగే. అందుకేనేమో, ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోని సూరత్ పట్టణానికి చెందిన అతుల్ బేకరీ రికార్డు స్థాయి కేక్ ను తయారు చేయించింది. మహిళల సాధికారత కోసం పనిచేసే శక్తి ఫౌండేషన్ కూడా ఈ విషయంలో అతుల్ బేకరీతో చేయి కలిపింది. ప్రధాని మోదీ 'బేటీ బచావో బేటీ పడావో' అంటూ బాలికల కోసం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి మెచ్చిన శక్తి ఫౌండేషన్ మోదీ పుట్టిన రోజు కేకు విషయంలో అతుల్ బేకరీతో చేతులు కలిపింది. పిరిమిడ్ ఆకారంలో 3750 కిలోల, 7 అడుగుల పొడవు కేకును 30 మంది వంట మాస్టర్ల టీమ్ 48 గంటల సమయంలో తయారు చేసింది. ప్రపంచంలోనే అతి పొడవైన కేక్ గా ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం గిన్నిస్ బుక్ లో పోలండ్ దేశానికి చెందిన ఆరు అడుగుల పొడవు, 720 కిలోల బరువు గల కేకు రికార్డుగా నమోదై ఉంది.