: తెలంగాణ ఉద్యమం కుల, మతాలకు అతీతంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగింది: కోదండరాం
సెప్టెంబరు 17 సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ జేఏసీ కార్యాలయంలో ఆ కమిటీ ఛైర్మన్ కోదండరాం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ కోసం అమరులయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... అనేక చర్చల తరువాత సెప్టెంబరు 17 ని విలీన దినోత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సెప్టెంబరు 17ను జరుపుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజానికి మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. ప్రజాస్వామిక విలువలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కుల, మతాలకు అతీతంగా జరిగిందని ఆయన తెలిపారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, నాయకులు పోరాడారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలయ్యాకే సెప్టెంబరు 17 వెలుగులోకి వచ్చిందని, తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలనే భావన వ్యక్తమైందని ఆయన చెప్పారు.