: బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ!
ప్రముఖ బాలీవుడ్ నటీమణి విద్యా బాలన్ కు డెంగ్యూ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ముంబైలోని ఆమె స్వగృహంలోనే వైద్య పర్యవేక్షణలో ప్రస్తుతం విద్యా బాలన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోనందుకు బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు విద్యా బాలన్ అపార్ట్ మెంట్ లోనే నివాసం ఉంటున్న నటుడు షాహిద్ కపూర్ కు నోటీసులు జారీ చేశారు. జుహు తారా రోడ్డులోని తమ నివాస అపార్ట్ మెంట్ పరిసరాల్లో డెంగ్యూకు కారణమైన ఏడిస్ ఈజిప్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు బీఎంసీ చట్టంలోని సెక్షన్ 382 కింద నోటీసులు ఇచ్చారు. షాహిద్ తో పాటు అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మరొకరు కూడా బీఎంసీ నోటీసులు అందుకున్నారు. మరోవైపు బీఎంసీ దోమల నివారణ విభాగం అధికారులు శుక్రవారం విద్యా బాలన్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పరిసరాలను పరిశీలించారు. అపార్ట్ మెంట్ లోనే నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ నీటిలో ఏడిస్ ఈజిప్టి దోమలు మకాం వేసినట్టు గుర్తించారు. సెక్షన్ 382 కింద రూ.10వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ముంబైలోని పలు ఆస్పత్రుల్లో 1,500 మంది వరకు డెంగ్యూ అనుమానిత రోగులు చికిత్స పొందుతున్నారు.