: వెంకయ్యనాయుడుకి ఓవైపు స్వాగతం పలుకుతూ ర్యాలీ.. మరోవైపు 'గో బ్యాక్' అంటూ వామపక్షాల ర్యాలీ
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆంధ్రప్రదేశ్‌కు హోదాతో సమానమైన ప్యాకేజీని సాధించిన ఆయనను మరికొద్ది సేపట్లో బీజేపీ నేతలు సన్మానించనున్నారు. ఎయిర్‌పోర్టునుంచి విజయవాడలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వరకు బీజేపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు వెంకయ్యకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదంటూ వామపక్ష పార్టీల నేతలు విజయవాడలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. వెంకయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. హోదా సాధించకుండా వెంకయ్య ఆంధ్రప్రజలను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభినందన సభకు నిరసన తెలుపుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తకుండా పలువురు వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.