: హైదరాబాద్ జూకు వర్షం ఎఫెక్ట్.. రెండు రోజులుగా జంతు ప్రదర్శనశాల మూసివేత


అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కుదిపేస్తున్నాయి. జూను ఆనుకుని ఉన్న మీరాలం చెరువు వర్షాల దాటికి పొంగి పొర్లుతోంది. దీనికితోడు చెరువు కట్టకు గండి పడడంతో నీరు పెద్ద ఎత్తున జూలోకి వచ్చి చేరుతోంది. దీంతో అరుదైన జంతువులు ఉండే జూ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో రెండు రోజులుగా అధికారులు జూను మూసివేశారు. వర్షాల ఉద్ధృతి మరింత పెరిగితే చెరువు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న జూలో ప్రస్తుతం 1550 జంతువులు ఉన్నాయి. వీటిలో ఏనుగులు, పులులు, సింహాలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, అరుదైన పాములు, రకరకాల పక్షులు ఉన్నాయి. రాయల్ బెంగల్ టైగర్ కూడా ఈ జూలో ఉంది. మీరాలం చెరువుకు చిల్లు పడడంతో నీరు సఫారీ పార్క్ గుండా జూలోకి చేరుకుంటోంది. పరిస్థితి చేయి దాటడంతో మరో దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు జూను మూసివేశారు. జంతువులను ఎన్‌క్లోజర్లలోనే బంధించి ఉంచారు. ఇంజినీర్లు చెరువుకట్ట పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News