: అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాయ.. హైటెక్ సిటీ వద్ద రూ.5వేల కోట్ల విలువైన భూమి కాజేసిన వైనం!

అరకు ఎంపీ కొత్తపల్లి గీత మెడచుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైటెక్ సిటీకి అతి సమీపంలో ఉన్న వేలకోట్ల రూపాయల విలువైన భూమికి ఎసరు పెట్టారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పాన్ మక్తాలో పాత ముంబై హైవేకు ఆనుకుని ఉన్న ఈ భూమిపై కన్నేసిన గీత తన ‘తెలివితేటలు’ ఉపయోగించి రాత్రికి రాత్రే అన్ని రకాల పత్రాలు సిద్ధం చేశారు. భర్త పి.రామకోటేశ్వరరావు పేరుతో 99.07 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించారు. భూమి రిజిస్ట్రేషన్ తర్వాత ఆ భూమిని చూపించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.25 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే తీసుకున్న రుణాన్ని నిర్మాణాలకు వాడకపోవడమే కాకుండా తిరిగి చెల్లించలేదంటూ బ్యాంకు కేసు పెట్టడంతో వ్యవహారం సీబీఐకి చేరింది. విచారణ జరిపిన బ్యాంకింగ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ సెల్.. అసలు ఆ భూమి పత్రాలు ఫోర్జరీ అని తేల్చింది. సేల్‌డీడ్ మొత్తం మోసపూరితమేనని పేర్కొంది. పూర్తి ఆధారాలతో ఎంపీ గీతపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఇంత జరిగినా ఆ భూమి హక్కుదారుని తానేనంటూ గీత చెబుతుండడం గమనార్హం. మరోవైపు ఈ భూమి టీఎస్ఐఐసీకి సంబంధించినదంటూ రెవెన్యూ అధికారులు బోర్డులు పాతడంతో గీత మీడియాకెక్కిన సంగతి తెలిసిందే.

More Telugu News