: ఇక సినిమా షూటింగులకు అనుమతులు చాలా ఈజీ... పార్లమెంటుకు వస్తున్న బిల్లు!
బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్ లకు అనుమతులు తెచ్చుకోవాలంటే నిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తుంటుంది. ఎన్నో శాఖల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగేస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో లేదా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అనుమతులు పొందాల్సి ఉంటుందని, ఈ అనుమతులు అన్నీ వచ్చేందుకు ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుందని, దీని ప్రభావం షూటింగ్ పై పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు ప్రకాష్ ఝా, మధుర్ బండార్కర్ అభ్యర్థన మేరకు ఈ సమస్యలపై చట్టపరంగా దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నామని ఆయన పేర్కొన్నారు.