: ఉప్పమ్మ..ఉప్పు.. గ్రామస్తుడి వీపుపై ఎక్కిన అధికారి!
‘ఉప్పమ్మ.. ఉప్పు..' ఈ ఆట గుర్తుండే ఉంటుంది. చిన్న పిల్లలను సరదాగా వీపుపై ఎక్కించుకుని అటూఇటూ తిప్పుతూ ఆడే ఆట. మరి, ఇదే ఆట ఒక ప్రభుత్వాధికారి ఆడాడు. దీంతో విమర్శల పాలయ్యాడు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఒక గ్రామ పర్యటనకు ప్రభుత్వ సబ్-ఇంజనీర్ అరవింద్ త్రిపాఠి వెళ్లారు. ఈ క్రమంలో ఒక మురుగు నీటి కాల్వను దాటాల్సి వచ్చింది. అయితే, టక్ చేసి, బూట్లు ధరించిన ఆ అధికారి అందులో దిగి నడవడానికి కొంచెం తటపటాయించాడు. ఇంతలో, ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. ఇంజనీర్ గారిని తన వీపుపై ఎక్కించుకుని కాల్వ దాటించాడు. కట్ చేస్తే, ఇదేదో, గొప్ప పని అనుకున్న ఆ ఇంజనీర్ ఆ ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది, మీడియాలో, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే, తన ఫ్యాంటు, షూస్ తడిసిపోతాయని, తనకు సాయం చేయాలని ఆ ఇంజనీర్ కోరడంతోనే యువకుడు సాయపడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా గతంలో వరద ప్రాంతాలు పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఇటువంటి పనే చేశారు. మోకాళ్ల లోతు నీటిలో ఆయన తడవకుండా ఉండేందుకని భద్రతా సిబ్బంది చౌహాన్ ని ఎత్తుకుని తీసుకెళ్లారు. అదే స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వ సబ్- ఇంజనీర్ ఆవిధంగా చేశారంటూ విమర్శించిన వారూ లేకపోలేదు.