: నష్టాల నుంచి తేరుకున్నా అమ్మకాల ఒత్తిడిలోనే స్టాక్ మార్కెట్!


యూఎస్ ఫెడ్ తన తదుపరి పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న నిపుణుల అంచనాల మధ్య గత కొద్ది సెషన్లుగా ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో సాగుతున్న సూచికలు శుక్రవారం నాడు తేరుకున్నప్పటికీ, సెషన్ చివర్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 350 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్, ఆపై మధ్యాహ్నానికి లాభాన్ని 450 పాయింట్లకు పెంచుకుంది. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఉన్న వేళ, ఆ ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీలపై స్పష్టంగా కనిపించింది. దీంతో ఎఫ్ఐఐలు సహా, దేశవాళీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో సూచికలు కిందకు దిగొచ్చాయి. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 186.149 పాయింట్లు పెరిగి 0.66 శాతం లాభంతో 28,599.03 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 37.30 పాయింట్లు పెరిగి 0.43 శాతం లాభంతో 8,779.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.32 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.15 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, ఐటీసీ, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, యస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, జడ్ఈఈఎల్, హిందాల్కో తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,934 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,323 కంపెనీలు లాభాలను, 1417 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,10,90,041 కోట్లకు చేరింది.

  • Loading...

More Telugu News