: నేపాల్‌కు మరో 75 కోట్ల డాలర్ల రుణసాయం ప్రకటించిన భారత్
భారత్‌లో పర్యటిస్తోన్న నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమాల్ దహాల్ (ప్రచండ) ఈరోజు ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా నేపాల్, భారత్‌కి మధ్య మూడు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్, నేపాల్ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నేపాల్‌కు మరో 75 కోట్ల డాలర్ల రుణసాయాన్ని భారత్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ భారత్-నేపాల్ ఇరుగుపొరుగునున్న మిత్ర దేశాలని అన్నారు. ఆ దేశంలో శాంతి, సుస్థిరత మన ఉమ్మడి లక్ష్యాలని మోదీ పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధిలో భారత్ భాగస్వామిగా ఉండడం గౌరవంగా ఉందని వ్యాఖ్యానించారు. నేపాల్ ప్రజలు, ఆ దేశ ప్రాధాన్యాలకు అనుగుణంగా భారత్ తోడ్పాటునందిస్తుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య మైత్రి భారత్, నేపాల్‌లకు ఎంతగానో లాభిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రచండ మాట్లాడుతూ... మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తోన్న అభివృద్ధి తమ దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆర్థిక, శాస్త్రసాంకేతిక, కమ్యూనికేషన్, పరిశోధన రంగాల్లో భారత్ సాధించిన పురోగతిపై తాను మోదీతో చర్చించినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు.