: నన్ను సీఎంగా చూడాలని నయీమ్ కలగన్నాడు!: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య


రాడికల్ ఉద్యమ సమయంలో నయీమ్ తనతో కలిసి పనిచేశాడని, తనను సీఎంగా చూడాలన్నది నయీమ్ కలని ఎల్బీ నగర్ తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన కృష్ణయ్య, పలు విషయాలను గురించి వివరించారు. చంద్రబాబు తన పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తరవాత, నయీమ్ సంతోషించాడని అన్నారు. తన గెలుపు, ప్రచారం వెనుక ఆయన హస్తం లేదని చెప్పిన కృష్ణయ్య, 1986 నుంచి నయీమ్ తనకు తెలుసునని, పట్లోళ్ల గోవర్థన్ రెడ్డి సైతం తనకు మంచి మిత్రుడేనని అన్నారు. నయీమ్ రాసుకున్న డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. నయీమ్ తో ఆర్థిక వ్యవహారాల్లో తనకు లింకులుంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే తన పేరును ఇరికించాలని చూస్తున్నారని అన్నాడు. ఈ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం తనకు నోటీసులు ఇస్తే వారి విచారణకు హాజరవుతానని తెలిపారు. అధికారపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు నయీమ్ తో దగ్గరి సంబంధాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం జరిపించే విచారణతో తనవంటి బడుగు నేతలే తప్ప పెద్ద తలలు బయటకు రావని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో లేదా సీబీఐ కేసును విచారించేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News