: సమాజ్ వాదీ పార్టీలో రోజుకో ట్విస్ట్... సామూహిక రాజీనామాలకు సిద్ధమైన శివపాల్ అనుచరులు
ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు రోజుకో ట్విస్టునిస్తున్నాయి. యాదవ్ కుటుంబంలో సంక్షోభం ముదిరిన విషయం తెలిసిందే. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, యూపీ రాష్ట్ర సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్ తన మంత్రి పదవికి, పార్టీ పదవులకు చేసిన రాజీనామాను ఆ రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆమోదించారు. అయితే ములాయం సింగ్ తిరస్కరించారు. రాష్ట్రంలోని ఇటావాలో శివపాల్ యాదవ్‌కు మద్దతుగా ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ చేపట్టి అఖిలేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సామూహిక రాజీనామాలకు సిద్ధమైనట్లు శివపాల్ కు మద్దతు తెలుపుతున్న నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నేతలతో ములాయం సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్, శివపాల్ మధ్య ఎటువంటి గొడవలు లేవని మీడియాతో అన్నారు. తానేం చెబితే అఖిలేశ్ అదే వింటాడని వ్యాఖ్యానించారు.