: నాడు ఎన్టీఆర్ కోసం కదిలిన దాసరి... నేడు పవన్ కల్యాణ్ కు అండదండగా సినిమా ప్లాన్!
సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి... రెండూ నాటి రాజకీయాల నేపథ్యంగా ఎన్టీఆర్ తో దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన సినిమాలు. రెండూ సూపర్ హిట్టే. ఈ సినిమాల ఘన విజయం నాడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి తమ వంతు మైలేజీని అందించాయి. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ఘన విజయం వెనుక ఈ సినిమాల ప్రమేయం కూడా అంతో ఇంతో ఉందనే చెప్పచ్చు. నాడు ఎన్టీఆర్ వెనకున్న దాసరి, నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ మైలేజీని సాధించి పెట్టేలా తనదైన శైలిలో ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే 'బోస్' సినిమాను పవన్ హీరోగా రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల దర్శకత్వానికి కాస్తంత దూరంగా ఉన్న ఆయన, 'బోస్'కు నిర్మాతగా వ్యవహరిస్తూ, సినిమాను అద్భుతంగా తెరకెక్కించే బాధ్యతలను బోయపాటి శ్రీను చేతుల్లో పెట్టినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. సినిమాలో సమకాలీన రాజకీయాలను ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి పవన్, తన వంతుగా ఏం చేయగలడో చూపేలా కథకు స్వయంగా దాసరి మెరుగులు దిద్దినట్టు సమాచారం. రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న జనసేనానికి ఈ చిత్రం ఏ మేరకు రాజకీయ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నది వేచి చూడాలి.