: హఠాత్తుగా మంటలు... 32 మందిని వదిలేసి పరారైన డ్రైవర్
షిర్డీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ కు చెందిన పీవై 01 సీకే 9552 నెంబరుగల వోల్వో స్లీపర్ బస్సు కర్ణాటకలోని హుమ్నాబాద్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురికాగా, విషయం మొట్టమొదట తెలుసుకున్న డ్రైవర్ బస్సులోని 32 మందినీ అలర్ట్ చేయకుండా బస్సును ఆపి పరారైనట్టు తెలుస్తోంది. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తొలుత నిరసనకారుల చర్యగా భావించినప్పటికీ, ఆపై షార్ట్ సర్క్యూటే కారణమని స్పష్టమవుతోంది. విషయాన్ని తెలుసుకున్న కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పటికే హుమ్నాబాద్ బయలుదేరి వెళ్లగా, కర్ణాటక ప్రభుత్వ అధికారులతో తెలంగాణ అధికారులు చర్చించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారంతా ప్రస్తుతం హుమ్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.