: యూపీలో సంచలనం.. పదమూడేళ్ల బాలుడిపై 'గూండా' కేసు
ఉత్తరప్రదేశ్, ఫర్రూఖాబాద్ జిల్లాలో పదమూడేళ్ల బాలుడిపై గూండా యాక్టు కింద కేసు నమోదయింది. పదమూడేళ్ల మైనర్ బాలుడిపై ఇటువంటి కేసు నమోదు కావడం భారత్‌లో ఇదే మొదటిసారి. సదరు బాలుడు కలౌలీ గ్రామానికి చెందిన నిందితుడు. తొమ్మిదో తరగతి విద్యార్థి అయిన ఈ బాలుడిపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి. పాఠశాలలో చదువుకునే వయసులోనే ఈ బాలుడు పలువురుపై దాడులకు దిగుతూ రెచ్చిపోతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణంగానే అతడిపై ఈ కేసు నమోదు చేయాల్సివచ్చిందని తెలిపారు. తన కుమారుడిపై పోలీసులు గూండా యాక్టు కింద కేసు నమోదు చేయడం పట్ల సదరు బాలుడి తండ్రి యోగేంద్రపాల్ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ఏ పాపమూ తెలియదని వాపోతున్నాడు. తన కుమారుడు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పాఠశాలకు కూడా వెళ్లడం మానేశాడని చెప్పాడు. పదమూడేళ్లకే బాలుడిపై ఈ కేసు నమోదు చేసిన అంశంపై ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నవాబ్ జంగ్ స్టేషను హౌజ్ ఆఫీసర్ ను మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు.