: ఆస్పత్రిలో ప్రభుదేవా.. వెన్నునొప్పితో విలవిల్లాడుతున్న ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’
సినీ నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవా ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అభినేత్రి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, 350 మంది డ్యాన్సర్లతో టైటిల్ సాంగ్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. సోనూసూద్ సహా ప్రధాన తారాగణంపై చిత్రీకరిస్తున్న పాటకు ప్రభుదేవా నృత్యాలు కంపోజ్ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా వెన్నునొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, కొన్ని రోజులపాటు ప్రభుకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్టు నటుడు సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు. మూడు భాషల్లో రూపొందుతున్న అభినేత్రి చిత్రం తమిళంలో ‘దేవి’గా, హిందీలో ‘టూటక్ టూటక్ టుటియా’గా విడుదల కాబోతోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.