: అమరావతికి చంద్రబాబు రక్షణ కవచంగా ఉన్నారు: దేవినేని నెహ్రూ
అమరావతికి చంద్రబాబు రక్షణ కవచంగా ఉన్నారని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబునాయుడిని ఎవరూ అడ్డుకోలేరని దేవినేని నెహ్రూ అన్నారు. టీడీపీలో ఆయన చేరుతున్న సందర్భంగా ఈరోజు నిర్వహించిన సభలో దేవినేని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆశలే ఊపిరిగా సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని, తనకు మంత్రి పదవి దక్కడంలో కీలకపాత్ర పోషించింది చంద్రబాబు నాయుడని అన్నారు. టీడీపీ అంటే తనకు ఎనలేని అభిమానమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆనాడు పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. తాను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ, మధ్యలో పార్టీ మారినా చివరకు తిరిగి టీడీపీలోనే చేరుతున్నట్లు నెహ్రూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీపై ఆయన విమర్శలు కురిపించారు.