: ఇక్కడ కూడా ‘పసుపు’ కళకళలాడితే బాగుంటుందని అనుకునేవాడినని: ఎమ్మెల్యే జలీల్ ఖాన్
ఎయిర్ పోర్టు నుంచి గానీ, ఏలూరు నుంచి గానీ వచ్చేటప్పుడు దేవినేని నెహ్రూ ఇంటివైపు చూసేవాడినని, ఈ ప్రదేశం కూడా ‘పసుపు’తో కళకళలాడితే బాగుంటుందని, అప్పుడు విజయవాడ మొత్తం టీడీపీకే అంకితమై పోతుందని అనుకునేవాడినని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. దేవినేని నెహ్రూ, అవినాష్, బుచ్చిబాబు టీడీపీలో చేరుతున్న సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీలోకి రావాలంటూ దేవినేనికి ఆహ్వానం అందిందని, అప్పుడు దేవినేనికి తానొక సలహా ఇచ్చానని చెప్పారు. అనుభవం లేని పిల్ల కాకులతో వెళ్లవద్దని.. వెళితే నష్టపోతావని, కృష్ణా జిల్లాకు, రాష్ట్రానికి నాయకుడివని ఆయనకు చెప్పానని అన్నారు. నెహ్రూ టీడీపీలో చేరుతుండటం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.