: నేర చరితుడు షాబుద్దీన్, మామూలోడు కాదు, ఉన్నత విద్యావంతుడు!


ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బీహార్ నేర చరితుడు, రాజకీయ నేత మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. షాబుద్దీన్ నేర చరితను చూసి అతను నిరక్ష్యరాస్యుడు, అసలేమాత్రం చదువురానివాడు అనుకుంటే కనుక మనం పొరబడ్డట్టే! ఎందుకంటే, షాబుద్దీన్ విద్యా అర్హత టెన్త్ క్లాసో, ఇంటర్మీడియటో కాదు. పొలిటికల్ సైన్స్ లో ఎంఏ, పీహెచ్ డి చేశాడు. ఇంతగా చదువుకున్న షాబుద్దీన్ నేరాల బాట పట్టడం ఆశ్చర్యకరమైన విషయమే. తనకు 19 ఏళ్ల వయసప్పటి నుంచే ఈయన నేరాలు చేయడం ప్రారంభించాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లోనే ఆయనపై తొలి పోలీసు కేసు నమోదైంది. తన చదువు కొనసాగిస్తూనే మరోవైపు నేరమయ జీవితంలో ఎదిగాడు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లో చేరాడు. 1990లో ఆర్జేడీ విభాగంలో చేరి అదే ఏడాదిలో ఎమ్మెల్యేగా గెలిచాడు షాబుద్దీన్. 1995లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. తన రాజకీయజీవితంతో పాటు నేరమయ జీవితాన్ని సమాంతరంగా నడిపించిన షాబుద్దీన్, రాజకీయ ప్రత్యర్థులను కిడ్నాప్ చేయడం, హత మార్చడం వంటి పలు నేరాలకు పాల్పడ్డాడు. అయితే, లాలూ ఆశీస్సులతో ఆర్జేడీలోకి వచ్చిన షాబుద్దీన్ కు సీఎం నితీశ్ హయాంలో ఎదురుదెబ్బతగిలింది. షాబుద్దీన్ ను అరెస్టు చేయించి, ఆయనపై కేసుల విచారణకు రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. మొత్తం 20 కేసులు ఆయనపై ఉన్నాయి. ఐదు కేసుల్లో ఆయన్ని ముద్దాయిగా కోర్టు తేల్చి చెప్పింది. జంట హత్యల కేసులో గత ఏడాది షాబుద్దీన్ తో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే, ప్రస్తుతం బీహార్ ఆర్జేడీ-జేడీయు కలిసి పనిచేస్తుండటం షాబుద్దీన్ కు కలిసొచ్చింది. యావజ్జీవ శిక్ష కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి ఇటీవల విడుదలైన షాబుద్దీన్ కు ఆయన పరివారం భారీ స్వాగతం పలికింది.

  • Loading...

More Telugu News