: భారత్‌లో నేటి నుంచి నేపాల్ ప్రధాని ప్రచండ మూడు రోజుల పర్యటన
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధానమంత్రి, మావోయిస్టు పార్టీ చీఫ్ పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ భారత్ వచ్చారు. ఆయనను భారత్‌లో పర్యటించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గతనెల 4వ తేదీన నేపాల్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రచండ తొలిసాగిగా భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. భారత్ లోని పలువురు నేతలతో కీలక అంశాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ డ్యామ్‌ను ఆయన సందర్శించనున్నారు. అనంతరం 1500 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ను ఉత్పత్తి చేసే నథ్పా జాక్రి జలశక్తి ప్రాజెక్ట్ ను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన ఢిల్లీలో నిర్వహించనున్న ప్రతినిధి స్థాయి చర్చల్లో భారత ప్రధాని మోదీతో కలిసి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.