: రూ. 22 వేల వరకూ తగ్గిన 'ఐఫోన్ 6' ధరలు
యాపిల్ ఐఫోన్ 7 సిరీస్ ఫోన్లు విడుదలైన తరువాత ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల అమ్మకాలు ఇక సాగవని భావించిన యాపిల్ సంస్థ తన చరిత్రలోనే తొలిసారిగా భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 6 ఎస్ సిరీస్ లో పలు వేరియంట్ల ధరలను రూ. 22 వేల వరకూ తగ్గిస్తున్నట్టు తెలిపింది. 6ఎస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 82 వేలు కాగా, దాన్ని రూ. 60 వేలకే పొందవచ్చని పేర్కొంది. ఇవే ఫోన్లలో పెద్ద స్క్రీన్ వేరియంట్లను రూ. 70 వేలకు పొందవచ్చని, ఈ సంవత్సరం మొదట్లో విడుదల చేసిన 4 అంగుళాల ఐఫోన్ ఎస్ఈ ధరను రూ. 49 వేల నుంచి రూ. 44 వేలకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఐఫోన్ 7 వేరియంట్లు వచ్చే నెల 7న భారత్ లో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.