: మానవత్వం మంటగలిసింది.. మృతదేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు!
బీహార్ పోలీసుల కర్కశత్వం మరోసారి వెలుగులోకొచ్చింది. మానవత్వాన్ని, విలువలను కాలదన్నుతూ.. పోలీసులు ఓ మృతదేహం మెడకు తాడు కట్టి వందల మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. సీసీ కెమెరాల ద్వారా ఈ దారుణ ఘటన బయటపడింది. పోలీసులు ప్రదర్శించిన ఈ అమానుష ఘటన పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకెళితే.. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ప్రవహించే గంగానదిలో ఇటీవలే ఓ వ్యక్తి శవం కనపడింది. దాన్ని గమనించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు, అనంతరం పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రెండు గంటల అనంతరం అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు ఎటువంటి వాహనాన్ని తీసుకురాలేదు. అంతేగాక, మృతదేహం మెడకు తాడు చుట్టారు. అనంతరం వందలమీటర్ల దూరంలో నిలిపిన వాహనం వరకూ ఆ మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. ఎంతో మంది స్థానికులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. వీడియో ద్వారా ఘటన గురించి తెలుసుకున్న అధికారులు ఇద్దరు పోలీసులని సస్పెండ్ చేశారు. సదరు జిల్లాల్లో ఇటువంటి ఘటనలు తరచూ కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.