: క్రేన్ దగ్గరికి మహా గణపతి... ఇదేం చోద్యమంటున్న ప్రజలు!
ప్రతి యేటా వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో జరిగే శోభాయాత్రకు బాలాపూర్ గణేశుడు ముందుండి సాగుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలాపూర్ వినాయకుడు ఇంకా పాతబస్తీయే దాటలేదు. బడంగ్ పూర్ లడ్డూ వేలం కూడా జరగలేదు. వందలాది మండపాల్లో కొలువుదీరిన విగ్రహాలు ఇప్పుడిప్పుడే వాహనాలపైకి చేరుతున్నాయి. దిల్ సుఖ్ నగర్ ఊరేగింపు ఇంకా మొదలే కాలేదు. మెహిదీపట్నం వైపు నుంచి ఒక్క విగ్రహమూ కదల్లేదు. ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన మహా గణపతి విగ్రహం అప్పుడే ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ దగ్గరికి వచ్చేసింది. మరో గంటలో నిమజ్జనం కూడా అయిపోతుంది. ప్రతియేటా నిమజ్జనోత్సవం చివర్లో జరిగే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఈ సంవత్సరం మొదటే జరుగుతుండటాన్ని వయోవృద్ధులు చోద్యంగా వ్యాఖ్యానించారు. తన చిన్నప్పటి నుంచి నిమజ్జనాన్ని చూస్తున్నామని, ఇంతవరకూ ఇలా జరగలేదని అంటున్నారు. ప్రస్తుతం క్రేన్ వద్దకు చేరుకున్న మహాగణపతికి తుది పూజలు జరుగుతుండగా, ఆపై, ట్రాలీ వెల్డింగ్ ను కట్ చేసి, నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ మార్గానికి చేరుకోగా, విషయం తెలియని వేలాది మంది ఖైరతాబాద్ కు వచ్చి, అప్పుడే గణపతి వెళ్లిపోయాడా? అంటూ ప్రశ్నిస్తూ, నిరాశగా వెనుదిరగడం కనిపిస్తోంది.