: కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు రూ. 20 వేల కోట్లను వెదజల్లనున్న కంపెనీలు!


ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైంది. వినాయక చవితితో మొదలై సంక్రాంతి వరకూ సాగే ఈ నాలుగు నెలల పండగల శుభవేళ, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఎఫ్ఎంసీజీ, సెల్ ఫోన్ కంపెనీల నుంచి ఈ-కామర్స్ సంస్థల వరకూ రూ. 20 వేల కోట్లను వెదజల్లనున్నాయి. వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా ద్వారా వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్, ప్రమోషన్స్ నిర్వహించేందుకు అన్ని కంపెనీలూ ప్రత్యేక బడ్జెట్ ను సిద్ధం చేసుకున్నాయని మీడియా ప్లానర్లు చెబుతున్నారు. గత సంవత్సరం దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సీజనులో వెచ్చించిన మొత్తంతో పోలిస్తే ఈ సంవత్సరం 12 శాతం వరకూ అధికంగా ప్రచారం నిమిత్తం వెచ్చించే అవకాశాలు ఉన్నట్టు డెంట్ సూ ఏజస్ నెట్ వర్క్ సౌతాసియా చీఫ్ ఆశిష్ భాసిన్ అంచనా వేశారు. రుతుపవనాలు బాగుండటంతో వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ కూడా ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో గృహోపకరణాలు, ద్విచక్ర వాహన సంస్థలు వ్యాపార ప్రకటనలను గుప్పించనున్నాయని ఆయన తెలిపారు. వినాయక చవితి, ఓనంతో ప్రారంభమయ్యే సీజన్ అమ్మకాలు దసరా, దీపావళి మధ్య పుంజుకుని సంక్రాంతి వరకూ సాగుతాయని, మొత్తం సంవత్సరంలో జరిపే అమ్మకాల్లో ఈ నాలుగు నెలల్లోనే 40 శాతం సాగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆభరణాలు, సెల్ ఫోన్లు, దుస్తులు, వాహనాల అమ్మకాలు ఈ యేడాది గణనీయంగా పెరగవచ్చని విశ్లేషించారు. మొత్తం మీద ఈ సంవత్సరం వ్యాపార ప్రకటనలకు పెట్టే ఖర్చు గత సంవత్సరంతో పోలిస్తే 13 శాతం అధికంగా రూ. 49,812 కోట్లకు చేరవచ్చని పిచ్ మాడిసన్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. స్నాప్ డీల్, ఐటీసీ, అమేజాన్, ఫ్లిప్ కార్ట్, హీరో మోటో, హోండా, రిలయన్స్ జియో తదితర కంపెనీలు ఈ దఫా అధికంగా మార్కెటింగ్ నిమిత్తం ఖర్చు పెట్టనున్నాయని మాడిసన్ వరల్డ్ చైర్మన్ శామ్ బల్సారా అభిప్రాయపడ్డారు. ఒక్క స్నాప్ డీల్ సంస్థ రూ. 200 కోట్లను పండగ సీజన్ ప్రకటనల నిమిత్తం కేటాయించిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News