: లిబియా ఉగ్రవాదుల చెర నుంచి గోపీకృష్ణ, బలరాం విడుదల
లిబియాలో అపహరణకు గురైన తెలుగువారు తిరువీధుల గోపీకృష్ణ, బలరాం కిషన్ లు విడుదలయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. గత సంవత్సరం జూలై 29న కిడ్నాప్ నకు గురైన వీరిద్దరూ ఏడాదికి పైగా బందీలుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిని విడిపించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించాయని, త్వరలోనే ఇద్దరూ ఇండియాకు వస్తారని సుష్మ తెలిపారు. వీరి అపహరణ అనంతరం తీవ్రంగా తల్లడిల్లిన కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడులను పలుమార్లు కలసి, తమ ఆందోళనను తెలియజేశారు. తాము లిబియా దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని బందీల విడుదల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చి, ఆ పనులను లిబియాలోని భారత దౌత్యాధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే చర్చలు ఫలించగా వారిని ఉగ్రవాదులు విడిచిపెట్టారు.