: హైదరాబాద్ లో మళ్లీ వర్షం... నిమజ్జనానికి ఆటంకం!
గత రాత్రంతా కురిసిన వర్షం ఈ తెల్లవారి కాస్తంత తెరిపినిచ్చినట్టు కనిపించినా, ఆపై ఉదయం 7 గంటల నుంచి తిరిగి కురుస్తుండటంతో, నేడు జరగాల్సిన గణేష్ నిమజ్జనం, శోభాయాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ లో కొలువైన మహా గణపతి నిమజ్జన యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. వర్షాల కారణంగా వెల్డింగ్ పనులు ఆలస్యం అవుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో, విగ్రహాలను లారీలపైకి తెచ్చే పనులు నిదానంగా సాగుతున్నాయి. దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ట్యాంక్ బండ్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ట్యాంక్ బండ్ లో దాదాపు 8 వేల విగ్రహాలు నేడు నిమజ్జనం కానున్న నేపథ్యంలో, అందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 34 క్రేన్లు అందుబాటులో ఉండగా, పోలీసు నిఘా కోసం 44 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ వైఫై సాయంతో పనిచేయనున్నాయి. ఇక గణేష్ ఊరేగింపు సాగే రహదారుల్లో సుమారు 12 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.