: ఇండియాలో ఇక కు.ని శిబిరాలు అక్కర్లేదు: కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ఇండియాలో ఇక కుటుంబ నియంత్రణ శిబిరాలు అక్కర్లేదని, వాటి స్థానంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కు.ని ఆపరేషన్లు చేస్తున్న చోట, శిబిరాల నిర్వహణ సక్రమంగా లేక, పలు రాష్ట్రాల్లో మహిళలు మరణిస్తుండటాన్ని గుర్తు చేస్తూ, దేవికా బిశ్వాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వచ్చే మూడేళ్ల వ్యవధిలో ఒక్క శిబిరం కూడా నిర్వహించాల్సిన అవసరం లేకుండా చూడాలని జస్టిస్ ఎంబీ లకుర్, యు.యు. లలిత్ లతో కూడిన ధర్మాసనం తన 51 పేజీల తీర్పులో పేర్కొంది. ఒకవేళ ఈ విధానం సత్ఫలితాలనే ఇస్తుందని ప్రభుత్వం భావిస్తే, లింగ సమానత్వాన్ని పాటించాలని, ప్రామాణిక నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించింది.