: కొడుకు ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి తండ్రిని ఢీకొట్టింది


కొడుకు ట్రాక్టర్ నడుపుతుండగా అది అదుపుతప్పి తండ్రిని ఢీకొట్టిన విషాద సంఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు పొదలకూరు రోడ్డు సెంటర్ కు చెందిన జి.వెంకటరమణయ్య తన ట్రాక్టర్ తో ఇసుక తీసుకువచ్చేందుకు పొట్టేపాళెం ఇసుక రీచ్ కు బయలుదేరాడు. సాయంగా తన కుమారుడ్ని కూడా తీసుకువెళ్లాడు. అయితే, వెంకటరమణయ్య సెల్ ఫోన్ లో ఛార్జింగ్ తక్కువగా ఉండటంతో పొట్టెపాళెం పాత హరిజనవాడ సమీపంలోని మూడోమైలు వద్ద ఉన్న ఒక దుకాణంలో ఛార్జింగ్ పెట్టి ఇసుక రీచ్ కు వెళ్లిపోయాడు. ఇసుక లోడ్ చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫోన్ ను తీసుకుందామనుకున్నాడు. తిరిగి వచ్చే సమయంలో, తన ట్రాక్టర్ ను రోడ్డు పక్కకు ఆపి, షాపులోని తన ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు. ఫోన్ మాట్లాడుతూ నిలబడ్డాడు. ఆ ట్రాక్టర్ నడపాలని తన కొడుక్కి సూచన చేశాడు. తండ్రి సూచన మేరకు కొడుకు ట్రాక్టర్ ను ముందుకు తీశాడు. అయితే, అదుపుతప్పిన ట్రాక్టర్ వెంకటరమణయ్య (48) ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సుబ్బారావు తెలిపారు.

  • Loading...

More Telugu News