: ఏపీకి అది ప్రత్యేక సాయం కాదు.. దిక్కుమాలిన, పనికిరాని ప్యాకేజీ: చలసాని శ్రీనివాస్
తెలుగు జాతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం, ద్రోహం చేస్తున్నాయని ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అంటే ఆంధ్రులహక్కు అని ఉద్ఘాటించారు. ‘హోదా కోసం జలదీక్షలు చేశాం...రక్తదానం చేశాం... జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించాం.. హోదా కోసం ఇంకా ఏం చేయమంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించింది ప్రత్యేక సాయం కాదని, దిక్కుమాలిన, పనికిరాని ప్యాకేజీ అని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఇటువంటి ప్యాకేజీలు వద్దని ఆయన అన్నారు. ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా కేంద్రం రాష్ట్రాన్ని మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తప్ప రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజీ అవసరం లేదని వ్యాఖ్యానించారు.