: పెద్ద కంపెనీలు కదల్లేని వేళ, దూసుకెళ్లిన చిన్న కంపెనీలు
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు మార్కెట్ గమనానికి సరైన దిశను సూచించేలా లేకపోవడంతో ఒడిదుడుకుల మధ్య సాగిన బెంచ్ మార్క్ సూచికలు దాదాపు స్థిరంగా ముగిశాయి. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా కంపెనీలు దూసుకెళ్లాయి. దేశవాళీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న చిన్న కంపెనీల్లో ఉత్సాహంగా ఈక్విటీలను కొనుగోలు చేశారు. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 18.69 పాయింట్లు పెరిగి 0.07 శాతం లాభంతో 28,372.23 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 0.13 శాతం లాభంతో 8,726.60 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.34 శాతం, స్మాల్ కాప్ 1.21 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్, టాటా మోటార్స్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, ఏసీసీ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బోష్ లిమిటెడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టీసీఎస్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,909 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,766 కంపెనీలు లాభాలను, 947 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,10,41,989 కోట్లకు చేరింది.