: జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు 4జీ తరంగాల కోసం ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ మధ్య తీవ్ర పోరు!
రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇవ్వాలంటే, దేశవ్యాప్తంగా 4జీ తరంగాలను పొందడమే మార్గమని నమ్ముతున్న ప్రధాన టెలికం సంస్థలు ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు అక్టోబర్ 1 నుంచి జరిగే మెగా స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ మూడు సంస్థలూ తమ దరఖాస్తులను ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)కి అందించినట్టు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తుల స్వీకరణకు నేడు ఆఖరు కాగా, మొత్తం రూ. 5.63 లక్షల కోట్ల విలువైన వాయు తరంగాలను కేంద్రం వేలం వేయనున్న సంగతి తెలిసిందే. వాయు తరంగాలను పొందలేని టెలికం సంస్థలు పెరుగుతున్న టెల్కో పోరులో వెనుకబడి పోవడం ఖాయమని ఆ శాఖ మంత్రి మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. వేగంగా క్వాలిటీతో కూడిన సేవలందిస్తూ, కస్టమర్లను నిలుపుకోవాలంటే, మరిన్ని వేగవంతమైన తరంగాలను టెలికం సంస్థలు కొనుగోలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. కాగా, తాజా వేలంలో అన్ని బ్యాండ్ల స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంది. 700 మెగా హెర్జ్, 800 మెగా హెర్జ్, 900 మెగా హెర్జ్, 1800 మెగా హెర్జ్, 2100 మెగా హెర్జ్, 2300 మెగా హెర్జ్ ఫ్రీక్వెన్సీలలో తరంగాలకు వేలం జరుగనుంది. ఈ తరంగాలను 4జీ సేవల నిమిత్తం కూడా వాడుకునే సౌలభ్యం ఉండటంతో ఎయిర్ టెల్, ఐడియాల మధ్య గట్టి పోటీ ఉండవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు.