: రూ. 38కి తగ్గిన ఎల్ఈడీ బల్బుల ధర
కేంద్ర ప్రభుత్వం ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియంట్ సర్వీసెస్ లిమిటెడ్) ద్వారా సబ్సిడీపై సరఫరా చేస్తున్న ఎల్ఈడీ బల్బుల ధరలు రూ. 38కి తగ్గాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం ఈఈఎస్ఎల్ బల్బుల ధరతో పోలిస్తే ఇది పదోవంతు మాత్రమే. 2014లో ఒక్కో బల్బును రూ. 310కి కొనుగోలు చేసిన ఈఈఎస్ఎల్, తాజాగా 5 కోట్ల ఎల్ఈడీ బల్బుల తయారీకి 'ఉన్నత జ్యోతి బై అఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్' పథకంలో భాగంగా టెండర్లు పిలువగా 14 కంపెనీలు పాల్గొన్నాయి. అతి తక్కువ ధరగా రూ. 38కి 9 వాట్స్ బల్బులను అందించేందుకు కోట్ వచ్చింది. ఇదే తరహా టెండర్ ను మార్చిలో పిలిచినప్పుడు రూ. 55కు టెండర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండేళ్ల క్రితం సాలీనా 10 లక్షల బల్బులు ఇండియాలో తయారవుతుండగా, ఇప్పుడది 4 కోట్ల బల్బులకు చేరింది. సాధారణ ఫిలమెంట్ బల్బులతో పోలిస్తే ఇవి 80 శాతం వరకూ విద్యుత్ ను ఆదా చేస్తాయి. గతంలో ఈ బల్బులను ఒక్కొక్కటీ రూ. 350కి సరఫరా చేయగా, ఈ ధరను రూ. 50కి చేరుస్తామని ప్రధాని మోదీ, తన పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని ఇళ్లలో ఉన్న 77 కోట్ల సంప్రదాయ బల్బులను ఎల్ఈడీలతో మారిస్తే 85 లక్షల కిలోవాట్ విద్యుత్ ను ఆదా చేయడంతో పాటు 15 వేల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో 3.5 కోట్ల వీధి దీపాలను ఎల్ఈడీలుగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈఎస్ఎస్ఎల్ ఉజలా పథకంలో భాగంగా 15 కోట్ల ఎల్ఈడీ లను దేశవ్యాప్తంగా పంపిణీ చేసింది. ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీలు సంయుక్తంగా ఈఈఎస్ఎల్ ను స్థాపించి నడుపుతున్న సంగతి తెలిసిందే.